Wednesday, January 18, 2017

ఎవరీ “గౌతమీపుత్ర శాతకర్ణి”

ఎవరీ “గౌతమీపుత్ర శాతకర్ణి” ???  History of  Gowthami puthra Sathakarni 


*BY lm

…… ఎవరీ “గౌతమీపుత్ర శాతకర్ణి” ??? – ఆయన తెలుగువాడా ??? ఆయన ఏ కులం వాడు ???
 అయితే చారిత్రక అంశంతో తీస్తున్న బాలయ్య సినిమా కథాంశంపైమాత్రం చాలా క్యూరియస్ గా ఎదురుచూస్తున్నారు. అందునా ఈ సినిమా బృందం మొదటినుండీ ప్రచారం చేస్తున్న “భారతదేశం మొత్తాన్నీ ఏలిన తెలుగువాడు” – “అమరావతిని కేంద్రంగా చేసుకొని ఆసేతుహిమాచలం పాలించిన తెలుగు చక్రవర్తి” అంటూ ఆసక్తిరేకించే ప్రచార తీరువల్ల మరింత కుతూహలం పెరిగింది.!!
.
=> “గౌతమీపుత్ర శాతకర్ణి” నిజంగానే తెలుగువాడా ???
.
=> నాటికి అసలు “తెలుగుభాష” ఉనికిలో ఉందా ???
.
=> నాడు వాడుకలో ఉన్న భాష – లిపి ఏమిటి ???
.
….. ఏమిటా కథా కమామీషు ??? చరిత్ర పేజీలు తిరగేస్తూ, ఆవిశేషాలను క్లుప్తంగా తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం…!!
.
// శాతవాహనులు //
“గౌతమీపుత్ర శాతకర్ణి” మహావీరుడు. శాతవాహనుల పాలకుల్లో 23వ రాజు. గొప్ప యోధుడు. శాతవాహన సామ్రాజ్య స్థాపకుడు “శ్రీముఖుడు”. ఈ శాతవాహన వంశంలో 30మంది రాజులు – క్రీ,పూ. 271 నుండి, క్రీ.శ. 174 వరకూ – షుమారు 445 సంవత్సరాలు పరిపాలించారు. వీరిలో “మొదటి శాతకర్ణి”, “రెండో శాతకర్ణి”, “మొదటి పులోమావి”, “హాలుడు”, “గౌతమీపుత్ర శాతకర్ణి”, “వాశిష్టీపుత్ర శాతకర్ణి”, “రెండో పులోమావి”, “యజ్ఞ శ్రీ శాతకర్ణి” తదితరులు సుప్రసిద్ధులు.
.
>> చంద్రగుప్తుని ఆస్థానంలోని గ్రీకు రాయబారి “మెగస్తనీసు” ఆంధ్రులకు 30 దుర్గాలు, లక్ష కాల్బలం, మూడువేల గుర్రాలు, రెండువేల ఏనుగులతో కూడిన సైనికశక్తి ఉన్నదని వ్రాశాడు. ఈ దుర్గాలు బహుశా 30 రాజ్యాలకు కేంద్రాలై ఉండవచ్చు. ప్రతిష్టానం, సౌధాన్యపురం, కోటిలింగాల, ధూళికట్ట, భట్టిప్రోలు, ధాన్యకటకం(ధరణికోట), తాంబ్రాప(చేబ్రోలు), నరసాల, విజయపురి మొదలైనవి ఆ 30నగరాలలోనివే. ఇవన్నీ చిన్నచిన్న గణరాజ్యాలు.
.
>> ఈ రాజ్యాలలో “ప్రతిష్టానపురం” రాజధానిగా మూలక, అశ్మక రాజ్యాలను “శాతవాహనులు” పాలించేవారు. శాతవాహన వంశానికి మూలపురుషుడైన “శాతవాహనుడు” అశోకుని సమకాలీనుడు. ఇతనే “శాతవాహన” పాలనకు పునాదులు వేశాడు. మౌర్యుల ఆధిపత్యాన్ని స్వీకరించి 23 సంవత్సరాలు పాలించాడు. మౌర్యుల పతనానంతరం కొన్నిదశాబ్దాలతరువాత పూర్తి అధికారంతో పాలించసాగారు.
.
>> శాతవాహనులకు “శతవాహనులు” – “శాలివాహనులు” – “శాతకర్ణిలు” – “ఆంధ్రులు” – “ఆంధ్ర భృత్యులు” అని పేర్లున్నాయి. దక్షిణాపథమంతా విస్తరించి ఉన్న శాతవాహన సామ్రాజ్యంలో ఈ “ఆంధ్ర దేశం” కూడా ఒక ప్రధానభాగం. “ఆంధ్ర” అనేది ఒక “జాతి” నామం – “శాతవాహన” అనేది “వంశ” నామం. – ఈ “శాతవాహన” – “శాతకర్ణి” అనే పేర్లకు సంబంచిన వివరాల లోతుల్లోకి ప్రస్తుతం వెళ్లడడంలేదు.
.
>> నేడు మనకు లభిస్తున్న శాతవాహనుల చరిత్రకు సంబంధించిన వివరాలకు ప్రధానమైన ఆధారం వారు వేయించిన శాసనాలే. వాటిలో మహారాష్ట ప్రాంతంలో ఎక్కువగానూ – ఆంధ్ర ప్రాంతంలో తక్కువగానూ లభిస్తున్నాయి. వీరి శాసనాలు “ప్రాకృత భాష”లో “బ్రాహ్మీ లిపి”లో వ్రాయబడి ఉన్నాయి. “ఖారవేలుని” – “హాతీ గుంఫా శాసనం”, “నాగానిక” – “నానాఘాట్ శాసనం”, “గౌతమీ బాలశ్రీ” – “నాసిక్ శాసనం” వీటిలో ప్రధానమైనవి.
>> శాతవాహనుల “జాతి” – “కులం” – “జన్మస్థలం” – “కాలము” మొదలైన విషయాలలో చరిత్రకారుల్లో ఏకాభిప్రాయం లేదు. అయితే, కొంతమంది చరిత్రకారుల ఆభిప్రాయం ప్రకారం ఈ శాతవాహనులు “ఆంధ్రులు” – వీరు జన్మించింది “ఆంధ్ర దేశం” లోనే – వీరి “మొదటి రాజధాని” – “కృష్ణ జిల్లాలోని “శ్రీకాకుళం – “గుంటూరు జిల్లా అమరావతికి” సమీపంలోని “ధాన్యకటకం(ధరణీకోట)”.. చివరకు “మహారాష్ట్ర ఔరంగాబాద్ జిల్లాలోని” “ప్రతిష్టానపురం (పైఠాన్) లు రాజధానులని “కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం. – అయితే, దొరికిన శాసనాలను బట్టీ, అవి లభిస్తున్న ప్రాంతాలనుబట్టీ చూస్తే ఇది సమంజసంగా అనిపించదు. “ప్రతిష్టానపురం” కేంద్రంగా పాలన మొదలుపెట్టిన వీరు, తదనంతరకాలాల్లో కర్ణాటక వైపు వచ్చి, ఆపై ఆంధ్ర ప్రాంతానికి వచ్చిఉండవచ్చు. శాతవాహనులు మొట్టమొదట దక్కన్ ప్రాంతంలోని ఒక తెగ అయ్యి ఉండవచ్చు. తదనంతరకాలంలో వీరు బ్రాహ్మణీకరణం పొందారు.
.
>> ఉత్తర భారతదేశంలో మౌర్యులకు స్థానిక వారసులు “శుంగ వంశీయులు”. వారి తరవాత “కణ్వులు”. దక్కన్ పీఠభూమిలో “మౌర్యులకు వారసులు ఈ శాతవాహనులు”. కానీ వీరు మౌర్యసామ్రాజ్యం పతనమైన కొన్ని దశాబ్దాల తరవాత పూర్తి అధికారానికి వచ్చారు. ఏవో కొన్ని పురాణాలలో పేర్కొనబడ్డ “ఆంధ్రులే” ఈ శాతవాహనులని భావిస్తున్నారు. అయితే, ఆ పురాణాలు “ఆంధ్రుల పరిపాలనను” పేర్కొన్నాయే కానీ, ప్రత్యేకించి “శాతవాహనుల పరిపాలనను” పేర్కొనలేదు. అలాగే “ఆంధ్ర” అన్న పదం శాతవాహనుల శాసనాల్లో ఎక్కడా కనిపించదు. ఇక పురాణాల్లో పేర్కొన్న “ఆంధ్ర – ఆంధ్రులు” అన్న అంశంపై కూడా అనేక వివాదాలున్నాయి. అది వేరే విషయం.
>> శాతవాహన కాలానికి పూర్వం ఉండిన జనావాసాలలో ఎరుపు; నలుపు-ఎరుపు; బూడిద రంగు పాత్రలు లభించాయి. ఇలాంటి పాత్రలే దక్కన్ ప్రాంతంలో కూడా అనేక చోట్ల లభించాయి. అలాగే వారి నాణేలు కూడా చాలాప్రాంతాల్లో బయటపడుతున్నాయి. కణ్వులను జయించి, మధ్య భారత దేశంలో తమ రాజ్యాన్ని స్థాపించుకొన్న తరువాత శాతవాహనులు శాసనాలను వేశారు. శాతవాహనుల తొలి శాసనాలు క్రీ.పూ. మొదటి శతాబ్దానికి చెందినవి. తొలి శాతవాహన రాజులు మన ఆంధ్రా ప్రాంతలో కాక మహారాష్ట్ర ప్రాంతంలోనే కనిపిస్తారు. అక్కడే వారి తొలి శాశనాలు కూడా లభించాయి. వారు మహారాష్ట్రాలో గోదావరికి ఎగువభాగంలో తమ రాజ్యాన్ని స్థాపించారు.
>> “ప్రతిష్టానపురం” కేంద్రంగా పాలిస్తూ, క్రమక్రమంగా శాతవాహనులు తమ అధికారాన్ని కర్ణాటక, ఆంధ్ర ప్రాంతాలకు విస్తరింపజేశారు. పశ్చిమ భారతదేశంలోనూ, దక్కన్ ఉత్తర ప్రాంతంలోనూ తమ రాజ్యాధికారాన్నీ స్థాపించుకొన్న “శకులు”, శాతవాహనులకు ప్రధాన శత్రువులు. ఒక సందర్భంలో మహారాష్ట్ర లోనూ, పశ్చిమ భారత దేశంలోనూ ఉన్న శాతవాహన రాజ్యాలను శాతవాహనులనుండి శకులు పూర్తిగా లాక్కొన్నారు. కానీ *** శాతవాహన వంశ ప్రతిష్టను మళ్ళీ నిలబెట్టిన గౌరవం “”గౌతమీపుత్ర శాతకర్ణి””కే దక్కుతుంది. ***
.
// గౌతమీపుత్ర శాతకర్ణి //

>> శాతవాహన పాలకులలో 23వ రాజు ఈ “గౌతమీపుత్ర శాతకర్ణి”. మహావీరుడు. గొప్ప యోధుడు. ఈయన పాలనాకాలానికి వచ్చేసరికి శాతవాహనులు ఎన్నో ప్రాంతాలను కోల్పోయి దయనీయమైన స్థితిలో ఉన్నారు. వారి పూర్వీకులు కోల్పోయిన ఎన్నో ప్రాంతాలను దండెత్తి తిరిగి సాధించగలిగాడు ఈ గౌతమీపుత్ర శాతకర్ణి. ఇతను రాజ్యానికి వచ్చేనాటికి “శక – పహ్లవ సామ్రాజ్యం” విచ్చినమైంది. మధ్య ఆసియాలోని యూచీ తెగకు చెందిన కుషాణులు వాయువ్య దిశనుండి వచ్చి “శక – పహ్లవులను” వేధించసాగారు. ఈ పరిస్థితులు గౌతమీపుత్ర శాతకర్ణికి అనుకూలించి, వాటిని జయించాడు.
.
>> ఈ “గౌతమీపుత్ర శాతకర్ణి” తనను తాను “ఏకబ్రాహ్మణుడ”ని పిల్చుకొన్నాడు. అతడు శకులను ఓడించాడు – అనేకమంది క్షత్రియ రాజులను మట్టుబెట్టాడు – తన ప్రధాన శత్రువైన “నహపణుని” “క్షహారత వంశాన్ని” నిర్వంశం చేసినట్లుగా ప్రకటించుకొన్నాడు. నాశిక్ వద్ద లభించిన నహపణుడి వెండి నాణేలమీద ఈ గౌతమీపుత్ర శాతకర్ణి పునర్ముద్రణ చిహ్నాలు ఉండడం వల్ల ఈ విషయం సత్యమేనని నిర్ధారితమవుతూ ఉంది. అంతే కాకుండా శకుల పాలనలో ఉన్న “మాళ్వా”, “కథియవార్” ప్రాంతాలను కూడా ఈ గౌతమీపుత్ర శాతకర్ణి ఆక్రమించుకొన్నాడు. ఈయన సామ్రాజ్యం “ఉత్తరాన మాళ్వా నుండి” – “దక్షిణాన కర్ణాటక వరకూ” వ్యాపించి ఉండేది. ఆంధ్రా ప్రాంతం మొత్తం అతని అధికారపరిధిలోనే ఉండేది.
.
>> శిథిలపైపోతున్న చాతుర్వర్ణ వ్యవస్థను తాను పునస్థాపన చేసినట్లుగా “గౌతమీపుత్ర శాతకర్ణి” చెప్పుకొన్నాడు. వర్ణసంకరం జరగకుండా తాను నిరోధించగలిగాననీ చెప్పుకొన్నాడు. తదనంతరకాలంలో శకులను క్షత్రియులుగా హిందూ సమాజంలోకి కలుపుకోవడం చేత వారికీ – శాతవాహనులకూ వివాహ సంబంధాలు సాధ్యమయ్యాయి.
.
>> గౌతమీపుత్ర శాతకర్ణి విజయాలనూ – గుణగణాలనూ – గొప్పతనాన్నీ, అతని తల్లి “గౌతమీ బాలశ్రీ” వేయించిన “నాశిక్ శాసనం” వివరంగా తెలియజేస్తున్నది. ఈ నాశిక్ శాసనం, గౌతమీపుత్ర శాతకర్ణుడిని “శాతవాహన కుల యశః ప్రతిష్టాపన కరుడు” – “క్షత్రియ దర్పమాన మర్దనుడు” – “క్షహరాట వంశ నిరవశేషకరుడు” – “శక, యవన, పహ్లవ నిషూదనుడు” – “ఏకబ్రాహ్మణుడు” – “ఏకశూరుడు” – “ఏక ధనుర్ధరుడు” – “ఆగమ నిలయుడు” – “త్రిసముద్ర తోయ పీతవాహనుడు” అని ప్రసంశించింది. దక్కన్ తో బాటు, మాళవ, సౌరాష్ట్ర లనూ, రాజస్థాన్ లోని కొన్ని భాగాలనూ పాలించాడని ఈ నాసిక్ శాసనం చెబుతుంది.
.
>> బలిష్టమైన శరీరంతో – ఆకర్షించే వదనంతో – వీరునిగా – శూరునిగా – అపజయం ఎరుగని పరాక్రమశాలిగా – అరివీర భయంకరుడిగా – శత్రువుని సైతం క్షమింపగలిగే ఉదార హృదయుడిగా – ప్రజలను కన్నబిడ్డలవలే పరిపాలించిన సహృదయుడిగా – శాతవాహన వంశ ప్రతిష్టను పునరుద్ధరించి, రాజ్యానికీ, వంశానికీ, ప్రజలకూ కీర్తి ప్రతిష్టలను కల్గించిన వీరుడిగా ఈ “గౌతమీపుత్ర శాతకర్ణి” కీర్తింపబడ్డాడు.
.
//శాతవాహనుల మతం //
.
>> తాము “బ్రాహ్మణులమని” శాతవాహనులు ప్రకటించుకొన్నారు. బ్రాహ్మణీయ మత పురోగమనానికి చాలా దోహదపడ్డారు. మొదటినుండీ కూడా శాతవాహన రాజులూ – రాణులు అశ్వమేధం – వాజపేయం లాంటి ఎన్నో యజ్ఞాలను నిర్వహించారు. కృష్ణుడు – వాసుదేవుడు లాంటి ఎందరో దేవతలను పూజించారు. బ్రాహ్మణులకు ఉదారంగా యజ్ఞ దక్షిణాలను ఇచ్చారు. అలాగే వీళ్ళు బౌద్ధ భిక్షువులకు కూడా భూదానాలు విరివిగా చేసి బౌద్ధాన్ని కూడా అదేరీతిన పోషించారు. వీరి సామ్రాజ్యంలోని ప్రజల్లో, ముఖ్యంగా చేతి వృత్తుల వారిలో మహాయాన బౌద్ధం బహుళ వ్యాప్తిలో ఉండేది. వీరి కాలంలోనూ – వారి తదనంతరం పాలించిన ఇక్ష్వాకుల కాలంలోనూ మన ప్రాంతంలోని “నాగార్జున కొండ” – “అమరావతి” ప్రాంతాలు బౌద్ధ సంస్కృతికి ప్రధాన కేంద్రాలుగా భాసిల్లాయి.
.
>> శాతవాహనులు రాజ్యాధికారం చేపట్టేనాటికి ఉత్తరాది మతాలైన “వైదికం – బౌద్ధం – జైనం తదితరములు” దక్షిణాది ప్రజలచేత స్వీకరింపబడ్డాయి. దేశంలో వైదిక మతోద్ధరణ జరుగుతున్న సమయంలో శాతవాహనులు అధికారంలోకి వచ్చారు. దక్షిణాపథంలో వైదిక మతస్థులై, వైదిక మతోద్ధరణకు కృషి చేశారు. రెండవ శాతకర్ణి రెండు “అశ్వమేధాలు – ఆప్తోర్యామ – అనారంభీయ – గర్గత్రిరాత్ర – అతిరాత్ర – అగ్నిష్టోమ – గవామయన – రాజసూయాది” వైదిక క్రతువులను అనేకం చేసి, వేలాది గోవులనూ, కార్షపణాలను బ్రాహ్మణులకు దానం చేసినట్లు అతని రాణి “నాగానిక” వేయించిన “నానాఘాట్ శాసనం” వల్ల తెలుస్తుంది.
.
>> క్రీ.పూ. రెండవ శతాబ్దపు శాసనమైన “నానాఘాట్ శాసనం”లో పేర్కొన్న “ఇంద్ర – సంకర్షణ – చంద్ర – సూర్య – యమ – వరుణ – కుబేరాది దైవప్రార్థనలను” బట్టి, పౌరాణిక హిందూమతం అప్పుడప్పుడే ప్రవేశిస్తున్నట్లు తెలుస్తూంది. ఆకాలంలో శైవ – వైష్ణవ సాంప్రదాయాలు ప్రజల్లో బహుళ వ్యాప్తిచెందాయి. శివకేశవాది దేవతలను పూజించడం, తీర్థయాత్రలు, తిరనాళ్ళతో కూడిన సాంప్రదాయాలూ వ్యాప్తిచెందడం ప్రారంభమయ్యింది.
.
>> “గౌతమీపుత్ర శాతకర్ణి” కాలానికి బౌద్ధ – జైన మతాల ప్రభావం వల్ల వైదిక క్రతువులు వెనకబడ్డాయి. అది సంధికాలమని తెలుస్తుంది. వర్ణసంకరానికి వ్యతిరేకమైన గౌతమీపుత్ర శాతకర్ణి, వర్ణాశ్రమ ధర్మాలను రక్షించడానికి కృషిచేశాడు. వైదిక విద్యాసంపన్నులైన బ్రాహ్మణ కుటుంబాలను పోషించాడు. అందువల్లే “ఆగమనిలయ” – “ఏకబ్రాహ్మణ” అన్న బిరుదులు పొందాడు.
.
>> వీరి పాలనాకాలంలో మహారాష్ట్ర వాయువ్య ప్రాంతంలో అనేక చైత్యాలనూ – విహారాలనూ నిర్మించారు. అసాధారణమైన రీతిలో పెద్దపెద్ద బండరాళ్లలో వీటిని నిర్మించారు. వాస్తవానికి వీటి నిర్మాణం శాతవాహనులకంటే ఒక శతాబ్దం ముందుగానే ప్రారంభమయ్యింది. ఇకపోతే, ఆంధ్ర దేశంలోని “కృష్ణ – గోదావరి” ప్రాంతంలో కూడా రాతిలో తొలిచిన గుహాలయాలు చూడవచ్చు. కానీ, ఈ ప్రాంతం స్థూపాకారంలో ఉన్న స్వతంత్ర బౌద్ధనిర్మాణాలకే ప్రసిద్ధి. వీటిలో ముఖ్యమైనవి “అమరావతి” – “నాగార్జున కొండ” ప్రాంతాలు. అమరావతి స్థూప నిర్మాణం క్రీ. పూ. 200 ప్రాంతంలో ప్రారంభమయ్యింది. క్రీ. శ. రెండవ శతాబ్దం ఉత్తరార్ధంలో దీన్ని పూర్తిగా పునర్నిర్మించారు. శంఖాకార నిర్మాణం కలిగిన దీని అడుగు వ్యాసం కొలత 53 మీటర్లు – ఎత్తు షుమారు 33 మీటర్లు ఉంటుంది. ఈ స్థూపంలో బుద్ధుని జీవితానికి చెందిన అనేక దృశ్యాలు రాళ్లమీద మలచబడ్డాయి.
.
// శాతవాహనుల భాష – లిపి //
 శాతవాహనుల రాజభాష “ప్రాకృతం” – వారు వేయించిన శాసనాలన్నీ “ప్రాకృత భాషలో – బ్రాహ్మీ లిపిలో” ఉన్నాయి. అశోకుడు వేయించిన శాసనాలు కూడా ఇదే పద్ధతిలో ఉన్నాయి. కొంతమంది శాతవాహన రాజులు “ప్రాకృత గ్రంధాలను” కూడా వ్రాశారని తెలుస్తోంది. వీటిలో శాతవాహనుల 17 రాజైన “హాలుడు” సంకలనం చేసిన “గాధా సప్తశతి” ప్రముఖమైనది. దీంట్లో 700 ప్రాకృత పద్యాలున్నాయి.
.
>> అంటే దీనర్థం, శాతవాహనుల కాలం నాటికి ఇంకా “తెలుగు – కన్నడం” లాంటి భాషలకు ఒక నిర్దిష్టమైన రూపం లేదని తెలుస్తుంది. “దేశీ” అనే ఒక భాష ఉన్నట్లు “గుణాడ్యుడి” జీవితగాథను బట్టి తెలుస్తుంది. ఇది ప్రజల వాడుకభాషయై ఉండాలి. “హాలుది – గాఢా సప్తశతి”లో “అత్త”, “అమ్మి”, “అందం”, “పొట్ట”,  “పాడి”, “వంటి అనేక “దేశీ” భాషా పదాలున్నాయి. లభ్యమైన శాతవాహనుల నాణేలవల్ల ఈ “దేశీ” భాష “తెలుగు”కు సన్నిహితంగా ఉన్నట్లు పండితుల భావన.
శాతవాహనులలో “మాతృస్వామ్య వ్యవస్థ” లక్షణాలు కనిపిస్తాయి. తల్లి పేరుతో గుర్తించబడటం వారి సాంప్రదాయం. “గౌతమీపుత్ర” – “వాషిశ్టీపుత్ర” మొదలైన రాజుల పేర్లు ఆనాటి సమాజంలో తల్లికి ఉన్నతమైన స్థానం ఉండేదని సూచిస్తున్నాయి. శాతవాహనుల రాణులు స్వయంగా మతసంబంధమైన పెద్దపెద్ద దానాలు కూడా చేశారు. వీరిలో కొందరు రాజప్రతినిధులుగా కూడా వ్యవహరించారు, శాసనాలు కూడా వేయించారు. కానీ ప్రాథమికంగా పితృస్వామ్య వ్యవస్థనే పాటించిందని చెప్పవచ్చు. ఎందుకంటే రాజ్యాధికారం పురుషులకు మాత్రమే సంక్రమించేది.
.
>> ఇంతగొప్ప మహాసామ్రాజ్యం, 30వ పాలకుడైన “మూడవ పులోమావి” తరవాత క్షీణించడం మొదలయ్యింది. చూటులు – అభీరులు – ఇక్ష్వాకులు – క్షాత్రపులు మొదలైన రాజులు విజృంభించడం, దానికితోడు అంతః కలహాలతో, అద్వితీయమైన ఈ శాతవాహన మహాసామ్రాజ్యం క్రీ.శ. రెండవ శతాబ్దం అంతానికి కాలగతిలో కలిసిపోయింది.
.
[ఇదీ “శాతవాహనుల” మరియు వారి రాజుల్లో గొప్పవాడైన “గౌతమీపుత్ర శాతకర్ణి” కి సంబంధించిన క్లుప్తమైన చరిత్ర.

No comments:

Post a Comment