Saturday, January 14, 2017

భారత రాజ్యాంగం

పాలిటీ - భారత రాజ్యాంగం




భారతదేశం రాష్ట్రాల కలయిక అంటే యూనియన్. ఏడో షెడ్యూల్ ప్రకారం కేంద్ర- రాష్ట్రాల మధ్య పాలనకు సంబంధించిన అధికారాలు విభజించారు. సమాఖ్య విధానాన్ని అనుసరించినప్పటికీ, రాజ్యాంగంలో సమాఖ్యకు బదులుగా యూనియన్ అనే పదాన్ని ఉపయోగించారు. బి.ఆర్. అంబేద్కర్ సూచన ప్రకారం కెనడా దేశ సమాఖ్యను ఆధారంగా తీసు కున్నారు. మన రాజ్యాంగంలో కూడా యూనియన్ అనే పదాన్ని వినియోగించారు. దీనికి ప్రధాన కారణం మన సమాఖ్య సూత్రబద్దం కాకపోవడమే. ‘సమాఖ్య’ పదానికి సమాన ఆంగ్ల పదం ‘ఫెడరేషన్.’ ఇది లాటిన్‌లోని ‘ఫోడస్’ అనే పదం నుంచి ఉద్భవించింది. ఫోడస్ అంటే ‘ఒప్పందం’ అని అర్థం. ఈవిధంగా ఏర్పడిన ప్రభుత్వానికి ఉత్తమ ఉదాహరణ అమెరికా సమాఖ్య. 1776లో అమెరికా స్వాతంత్య్రం పొందిన తర్వాత 1787లో రాజ్యాంగాన్ని రూపొందించుకునే నాటికి అమెరికాలోని 13 రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పంద అవగాహనే అమెరికా సంయుక్త రాష్ట్రాలు. మనది అమెరికా వంటి సమాఖ్య కాదు.

ఒప్పంద ఫలితం కూడా కాదు. పాలనా సౌలభ్యం కోసం మాత్రమే రాజ్యాంగం ద్వారా కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికారాలు పంపిణీ చేశారు. అందువల్ల ఏ విభాగానికి, రాష్ట్రానికి లేదా కేంద్రపాలిత ప్రాంతానికి మన దేశం నుంచి విడిపోయే అధికారం లేదు. పాలనా సౌలభ్యం కోసం మాత్రమే రాష్ట్రాల పునర్విభజన చేశారు.

రాష్ట్రాల విభజన:
రాష్ట్రాల పునర్విభజన సమయంలో కూడా పూర్తి అధికారం కేంద్ర ప్రభుత్వం అంటే పార్లమెంట్‌కు మాత్రమే ఉంది. రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ సమయంలో రాష్ర్టపతి ఆ రాష్ర్ట శాసనసభ అభిప్రాయం తెలుసుకోవచ్చు. ఐతే శాసనసభ అభిప్రాయాన్ని కచ్చితంగా పాటించాల్సిన అవసరం కేంద్రానికి లేదు. కేంద్రం తన ఇష్టానుసారం నిర్ణయం తీసుకుంటుంది. రాజ్యాంగంలోని రెండో అధికరణ ప్రకారం దేశ భూభాగంపై ఎలాంటి నిర్ణయమైనా తీసుకొనే అధికారం పార్లమెంట్‌కు ఉంది.

1960లో బేరూబారి కేసులో మన భూభాగాన్ని ఇతరులకు బదిలీ చేసే సందర్భంలో, ఇతర భూభాగాలు మన దేశంలో విలీనం చేసే సందర్భంలోనూ రాజ్యాంగ సవరణల ద్వారా పార్లమెంట్ నిర్ణయం తీసుకోవాలనీ.. అంతర్గత భూ భాగంలో మార్పులు చేసే సందర్భంలో రాజ్యాంగ సవరణలు తప్పనిసరి కావని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ప్రకారం దేశంలోని భూభాగం విషయంలో, రాష్ట్రాల పునర్విభజన సమయంలోనూ నిర్ణయాధికారం కేంద్ర ప్రభుత్వానికే ఉంది.

రాజ్యాంగ నిర్మాతలు దేశ పరిస్థితులకు అనుగుణంగా సమాఖ్య వ్యవస్థను నిర్మించారు. ‘ఏ దేశం రాజ్యాంగమైనా నాటి పరిస్థితులను ప్రతిబింబిస్తుందని’ నెహ్రూ పేర్కొనడానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది.

భారతదేశం స్వాతంత్య్రం పొందిన తర్వాత సొంత రాజ్యాంగాన్ని రూపొందించుకొనే సందర్భంలో దేశ విభజన కాలం నాటి పరిస్థితులు, శాంతి భద్రతల పరిరక్షణ, స్వదేశీ సంస్థానాలను విలీనం చేయడం.. వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని, కేంద్రంలో బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే ఉద్దేశంతో ఏకకేంద్ర లక్షణాలను పొందుపర్చారు. భారతదేశ భిన్నత్వం, దేశ విశాల పాలనా పరిధి ఆధారంగా ఆంగ్లేయులు 1935 చట్టం ద్వారా ఫెడరల్ వ్యవస్థను పరిగణలోనికి తీసుకొని సమాఖ్య లక్షణాలు కూడా పొందుపర్చారు. దీంతో మన సమాఖ్య అర్ధ సమాఖ్యగా రూపొందిందని కె.సి.వేర్ పేర్కొన్నారు. అంబేద్కర్ ప్రకారం ‘దేశం సాధారణ పరిస్థితుల్లో సమాఖ్య వ్యవస్థగా, అత్యవసర పరిస్థితుల్లో ఏక కేంద్ర ప్రభుత్వంగా పని చేస్తుంది.’ అంటే దేశం ఏక కేంద్ర, సమాఖ్య లక్షణాల కలయికగా ఏర్పడింది.’

అధికారాల పంపిణీ:
రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్‌లో కేంద్ర -రాష్ర్ట ప్రభుత్వాల మధ్య అధికారాల పంపిణీకి సంబంధించిన జాబితా ఉంది.

కేంద్ర జాబితా: జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యం ఉన్న 97 అంశాలు కేంద్ర జాబితాలో పొందుపర్చారు. కొన్ని మార్పుల కారణంగా ప్రస్తుతం ఈ జాబితాలోని అంశాల సంఖ్య 100కు చేరింది. 92వ అధికరణలో అంత రాష్ర్ట వ్యాపార, వాణిజ్యానికి సంబంధించిన పన్ను; కన్‌సైన్‌మెంట్ టాక్స్‌తో పాటు సేవలపై పన్ను అనే అంశాలను చేర్చడంతో ప్రస్తుతం ఈ జాబితాలో 100 అంశాలు ఉన్నాయి.

రాష్ట్ర జాబితా: ప్రాంతీయ ప్రాముఖ్యం ఉన్న 66 అంశాలను రాష్ర్ట జాబితాలో పొందుపర్చారు. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఐదు అంశాలను రాష్ర్ట జాబితా నుంచి తొలగించి ఉమ్మడి జాబితాలో చేర్చారు. ప్రస్తుతం ఈ జాబితాలో 61 అంశాలు మాత్రమే ఉన్నాయి.
ఉమ్మడి జాబితా: ప్రాంతీయ ప్రాముఖ్యం ఉన్నప్పటికీ జాతీయ దృక్కోణం కూడా అవసరమైన 47 అంశాలను ప్రారంభంలో ఉమ్మడి జాబితాలో చేర్చారు.

ఐతే 1976లో రాష్ర్ట జాబితాకు చెందిన ఐదు అంశాలు ఉమ్మడి జాబితాకు బదిలీ చేశారు. దీంతో ఈ జాబితాలోని అంశాల సంఖ్య 52కు చేరింది. ఉమ్మడి జాబితా అనే భావనను ఆస్ట్రేలియా నుంచి గ్రహించారు. పైన పేర్కొన్న మూడు జాబితాల్లో చేరని అంశాలు, కొత్తగా వచ్చే అంశాలను అవశిష్ట అధికారాలు అంటారు. ఈ అధికారాలను కేంద్రానికి కేటాయించారు. ఈ విషయంలో కెనడాను అనుసరించారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల మధ్య అధికారాల పంపిణీ వల్ల కేంద్ర ప్రభుత్వ పరిధిని గురించి 73వ అధికరణ, రాష్ర్ట ప్రభుత్వ అధికార పరిధిని 162వ అధికరణలో పేర్కొన్నారు. అధికారాల పంపిణీ, పరిధిని రాజ్యాంగం ద్వారానే నిర్ణయించడం వల్ల మన రాజ్యాంగం లిఖిత పూర్వకమైంది.

రాజ్యంగ సవరణలు:
సమాఖ్య వ్యవస్థలో రాజ్యాంగం ద్రుఢంగా ఉంటుంది. కారణం అధికారాల పంపిణీ రాజ్యాంగం ద్వారా జరగడం వల్ల రాజ్యాంగంలో ఎలాంటి సవరణలు చేయాలన్నా కూడా భారత పార్లమెంట్ 2/3వ వంతు మెజారిటీతో ఆమోదించి, 1/2వ వంతు రాష్ట్రాలు ఆ బిల్లును ఆమోదించాలి. రాజ్యాంగంలోని సమాఖ్య లక్షణాల్లో ఏ మార్పు చేయాలన్నా ఈ పద్ధతినే ఉపయోగించాలి. రాజ్యాంగ సవరణలో రాష్ట్రాల ఆమోదం పొందే పద్ధతిని అమెరికా నుంచి గ్రహించారు.

రాజ్యాంగ పరిధికి లోబడే:
కేంద్ర-రాష్ర్ట ప్రభుత్వాలు, రాష్ట్రాలు-రాష్ట్రాల మధ్య తలత్తే వివాదాలను పరిష్కరించడంలో సుప్రీంకోర్టు కీలక పాత్ర పోషిస్తుంది. సుప్రీంకోర్టుకు స్వయంప్రతిపత్తి కల్పించారు. దేశంలో కేంద్ర-రాష్ర్ట ప్రభుత్వాలు రాజ్యాంగ పరిధిలోనే ఏర్పడి, రాజ్యాంగం ద్వారానే అధికారాలు పొంది, రాజ్యాంగ పరిధికి లోబడి తమ అధికారాలు నిర్వర్తిస్తాయి. ప్రభుత్వాల మధ్య తలెత్తే సమస్యలను రాజ్యాంగ పరిధికి లోబడే సుప్రీంకోర్టు పరిష్కరిస్తోంది. దాంతో మన దేశంలో రాజ్యాంగ ఆధిక్యత ఉన్నట్టు పేర్కొనొచ్చు.

జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యం ఉన్న అంశాలు కేంద్ర ప్రభుత్వం; ప్రాంతీయ ప్రాముఖ్యం ఉన్న అంశాలు రాష్ర్ట ప్రభుత్వాలు నిర్వర్తిస్తాయి. ఈ విధంగా రెండు స్థాయిల్లో ప్రభుత్వాలు పని చేస్తున్నాయి. సమాఖ్య విధానాన్ని అనుసరించే దేశాల్లో ఎగువ సభలు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. మన దేశంలో దిగువ సభ లోక్‌సభ ప్రజలకు, ఎగువసభ రాజ్యసభ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. భారతదేశం కూడా అన్ని సమాఖ్యల మాదిరిగానే మౌలిక లక్షణాలను కలిగి ఉంది. దేశ ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మన సమాఖ్య విధానం రూపొందింది.

అమెరికా సమాఖ్యతో పోల్చితే..
ప్రపంచంలో వాస్తవ సమాఖ్యకు ఉదాహరణగా, ఆదర్శ సమాఖ్య దేశంగా అమెరికాను పేర్కొంటారు. ఎన్నో అంశాల్లో అమెరికాతో మన సమాఖ్య విభేదిస్తోంది. అమెరికా పౌరులకు ద్వంద్వ పౌరసత్వ ఉంది. భారతదేశంలో ఒకే పౌరసత్వ ఉంది. పౌరసత్వంలో మనం బ్రిటన్‌ను అనుసరించాం. అమెరికాలో అవశిష్ట అధికారాలను రాష్ట్రాలకు కేటాయిస్తే, మన దేశంలో అవశిష్ట అధికారాలను కేంద్ర ప్రభుత్వానికి కట్టబెట్టారు. ఈ విషయంలో కెనడాను అనుసరించాం.

అమెరికాలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలకు వేర్వేరుగా రెండు రాజ్యాంగాలు ఉంటాయి. మన దేశంలో ఒకే రాజ్యాంగం ఉంది. న్యాయ వ్యవస్థ విషయంలో అమెరికాలో వికేంద్రీకరణ ఉంది. అక్కడ జాతీయ, రాష్ట్రాల న్యాయ వ్యవస్థలు వేర్వేరుగా ఉంటాయి. మన దేశంలో ఏకీకృత న్యాయ వ్యవస్థ ఏర్పాటు చేశారు. బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో ప్రవేశపెట్టిన సమీకృత న్యాయవ్యవస్థనే మనం అనుసరిస్తున్నాం.

రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించే ఎగువ సభల విషయం కూడా భారత్, అమెరికాల మధ్య భిన్నత్వం ఉంటుంది. అమెరికా సెనేట్‌లో మొత్తం 100 మంది సభ్యులుంటారు. వారంతా 50 రాష్ట్రాల నుంచి.. ఒక్కొక్క రాష్ర్టం నుంచి ఇద్దరు సభ్యుల చొప్పున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మన రాజ్యసభలో రాష్ట్రాలకు అసమాన ప్రాతినిధ్యం ఉంది.

ఉత్తరప్రదేశ్‌కు రాజ్యసభలో 31 స్థానాలు ఉంటే.. అస్సాంను మినహాయించి మిగిలిన ఏడు ఈశాన్య రాష్ట్రాలు, గోవా నుంచి ఒక్కో సభ్యునికే ప్రాతినిధ్యం ఉంది. వాస్తవిక సమాఖ్యలో చిన్న, పెద్ద రాష్ట్రాలకు ఒకే విధమైన ప్రాతినిధ్యం ఉంటుంది. మన దేశంలో దీని భిన్నంగా ఉంది. రాజ్యాంగ సవరణ విషయంలో కూడా భిన్నత్వం ఉంది. భారత రాజ్యాంగం ద్రుఢ, అద్రుఢ లక్షణాల కలయికతో రూపొందించినప్పటికీ, అద్రుఢ లక్షణాలే ఎక్కువగా ఉన్నాయి.


రాజ్యాంగంలోని అనేక అంశాలను సాధారణ మెజార్టీతోనే పార్లమెంటు సవరిస్తుంది. రాజ్యాంగ సవరణ విషయంలో రాష్ట్రాల చొరవకు అవకాశం లేదు. పార్లమెంటు చేసే రాజ్యాంగ సవరణల్లో మార్పులు చేసే అధికారం రాష్ట్రాలకు లేదు. అందువల్ల మన దేశాన్ని ‘బలమైన కేంద్రీకృత ధోరణుల సమాఖ్య వ్యవస్థగా’ సర్ ఐవర్ జెన్నింగ్‌‌స వర్ణించారు. అలెగ్జాండ్రో విజ్ మన దేశాన్ని ‘వాస్తవిక సమాఖ్యగానే’ పేర్కొన్నారు.

No comments:

Post a Comment