Wednesday, January 18, 2017

కనిపించే కట్టడాలలో కనిపించని గుట్టుమట్లు

*కనిపించే కట్టడాలలో కనిపించని గుట్టుమట్లు!*


పది శోధన

ప్రపంచంలో ప్రఖ్యాతి, విశ్వవిఖ్యాతి చెందిన చారిత్రక, చరిత్రాత్మక (హిస్టారిక్, హిస్టారికల్‌)  నిర్మాణాలు ఎన్నో ఉన్నాయి. వాటిలోని కొన్ని కట్టడాలలో... కనిపించని మర్మాలు కూడా ఉన్నాయి. ఈ ప్రాచీన నిర్మాణాల గురించి దాదాపు అందరికీ తెలుసు కానీ... ఈ నిర్మాణాలలోని మార్మికత గురించి, రహస్యపు మందిరాల గురించి కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఆ విశేషాలు తెలుసుకుందాం....

*1. స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ*

న్యూయార్క్‌ సిటీలోని ‘స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ’.. చూడ్డానికి మాత్రమే కాదు, ఎక్కి చూడ్డానికి కూడా. కానీ ఇది ఒకప్పుడు! ఏళ్ల క్రితం ఈ స్వేచ్ఛా ప్రతిమ చేతిలోని ‘జ్యోతి’ వరకు వెళ్లి అక్కడి నుంచి సిటీ మొత్తం చూసేందుకు వీలుగా పైన ఒక గది ఉండేది. అయితే మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు 1916లో జర్మనీ దాడులకు ఈ గది భాగం స్వల్పంగా దెబ్బతినడంతో గదిలోకి సందర్శకులను అనుమతించడం ఆపేశారు. మళ్లీ ఇంతవరకు ఎవర్నీ పై వరకు ఎక్కనీయలేదు. ఇటీవలే 2011లో ఒక ‘టార్చ్‌ క్యామ్‌’ను ఆ గది దగ్గర్లో ఏర్పాటు చేశారు. అందులోంచి చూస్తే, ‘జ్యోతి’ ఉన్న ప్రదేశంలో నిలబడి సిటీ అంతా చూస్తున్న ఫీలింగ్‌ కలుగుతుందట!

*2. మౌంట్‌ రష్‌మోర్‌*

జార్జి వాషింగ్టన్, థామస్‌ జెఫర్సన్, థియోడర్‌ రూజ్‌వెల్ట్, అబ్రహం లింకన్‌... యు.ఎస్‌.లోని మౌంట్‌ రుష్‌మోర్‌పై కనిపించే ఈ నలుగురూ అమెరికాను అగ్రరాజ్యంగా మలిచిన పితామహులు. వీరిలో లింకన్‌ తల వెనుక భాగంలో ఒక గది ఉంటుంది! దాని గురించి ఎవరికీ తెలియదు. అందులో అమెరికా చరిత్ర అంతా ‘రికార్డెడ్‌’గా ఉంటుంది. ఈ రికార్డుల గదిని (‘హాల్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’) 1938–1939 మధ్య కట్టారు.  ముందుతరాల వారికి అమెరికా గురించి yీ టెయిల్డ్‌గా తెలియడానికని.

*3. హార్వింగ్టన్‌ హాల్‌*

ఇంగ్లండ్‌లోని 14వ శతాబ్దంనాటి ‘హార్వింగ్టన్‌ హాల్‌’ ఇది. ఇందులో నేలమాళిగల్లాంటి రహస్యపు గదులు చాలా ఉండేవి. (ఇప్పుడూ ఉన్నాయి). వాటిని ‘ప్రీస్ట్‌ హోల్స్‌’ అనేవారు. ఒకటవ క్వీన్‌ ఎలిజబెత్‌ ఆగ్రహానికి గురైన ప్రతిసారీ క్యాథలిక్‌ మతబోధకులను ఆమె కంటపడకుండా ఈ గదుల్లో దాచేవారు!

*4. డిస్నీల్యాండ్‌*

కాలిఫోర్నియాలోని డిస్నీల్యాండ్‌లో చాలా ఎట్రాక్షన్స్‌ ఉంటాయి. అందులో ఒకటి ‘పైరేట్స్‌ ఆఫ్‌ ది కరీబియన్‌’ ఒకటి. దానికి ఆనుకునే ఇంకో ఎట్రాక్షన్‌ కూడా ఉంది. అదొక తాగుబోతుల క్లబ్బు. దాని గురించి కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఆ క్లబ్బు బయట బోర్డు కూడా ఏమీ ఉండదు. ఒక తలుపు మీద మాత్రం 33 అని రాసి ఉంటుంది. దాన్ని బట్టి ఆ క్లబ్బు పేరుని మనం ‘క్లబ్‌ 33’ అనుకోవాలి! డిస్నీలాండ్‌ పార్క్‌ మొత్తం మీద ఈ క్లబ్బులో మాత్రమే ఆల్కహాల్‌ సర్వ్‌ అవుతుంది. మీకూ ఓ పెగ్గు కావాలా? అయితే మొదట సభ్యత్వం రుసుం 10,000 డాలర్లు చెల్లించాలి. అంటే సుమారు 6 లక్షల 80 వేల రూపాయలు! ఆ తర్వాత ఏడాదికి 3,500 డాలర్లు చొప్పున చెల్లిస్తుండాలి. సుమారు 2 లక్షల 38 వేల రూపాయలు!

*5. మాంట్‌ సెయింట్‌ ఓడియల్‌ కాన్వెంట్‌*

2003లో ఫ్రాన్సులోని మాంట్‌ సెయింట్‌ ఓడియల్‌ ధార్మిక ఆరామంలోని అతి ప్రాచీనమైన, అమూల్యమైన గ్రంధాలు కొన్ని చోరీకి గురయ్యాయి! అంత కట్టుదిట్టంగా ఉండే ఆ భవంతి నుంచి అవి ఎలా మాయం అయ్యాయన్నది కొన్ని ఏళ్లుగా మిస్టరీగా ఉండిపోయింది. ఆ తర్వాత కూడా అడపాదడపా బుక్స్‌ అదృశ్యం అవుతూనే ఉన్నాయి. పుస్తకాల గది తాళాలు అవి ఉండే చోటు నుంచి వేరొక చోటుకు మార్చినా చోరీలు ఆగట్లేదు. చివరికి కెమెరా ఫుటేజ్‌లో దొంగ పట్టుబడ్డాడు. ఆ పుస్తకాలను దొంగిలిస్తున్నది ఒక టీచర్‌! గ్రంథాలయ ప్రధాన ద్వారం నుంచి కాకుండా ఒక రహస్య సొరంగ మార్గం నుండి అతడు లోపలికి వస్తూ, బయటికి వెళ్లిపోతున్నట్లు గుర్తించారు. గోడలకు చెవులంటాయని చెప్పి (ఎవరైనా వింటారేమోనని) పూర్వం ఆరామంలోని సన్యాసులు లోనికి వచ్చిపోయేటప్పుడు తమ సంభాషణలను ఎవరూ వినకుండా ఉండడం కోసం ఏర్పరచుకున్న సొరంగం అది. టీచరు గారి పుణ్యమా సొరంగ రహస్యం బట్టబయలైంది.

*6. ఆక్స్‌బర్గ్‌ హాల్‌*

ఇంగ్లండ్‌లోని ఈ పదిహేనవ శతాబ్దపు భవంతిలో ఏడు రహస్య గదులు ఉన్నాయి. వాటి తలుపులు ఎప్పుడూ మూసే ఉంటాయి. అందులో ఒకటి పుస్తకాల గది. ఆ గదిలోంచి ఓ రహస్య మార్గం ఉంది. ఆ మార్గం చివర ఒక బుక్‌ షెల్ప్‌ ఉంది. అందులో ఉన్నవన్నీ అడల్ట్‌ పుస్తకాలు అనే రూమర్‌ ఉంది.

*7. డ్రమ్‌ క్యాజిల్‌*

2013లో పురావస్తు పరిశోధకులు స్కాట్‌లాండ్‌లోని 14వ శతాబ్దం నాటి డ్రమ్‌ క్యాజిల్‌లో ఒక రహస్య మందిరాన్ని కనుగొన్నారు. మధ్యయుగాల నాటి ఒక టాయ్‌లెట్‌ గది కూడా అందులో ఉంది. ఆ తర్వాత కొంతకాలానికి ఇంకో మందిరం బయటపడింది. కొల్లోడెన్‌ యుద్ధంలో ఓడిపోయిన తర్వాత మేరీ ఇర్విన్‌ అనే అంతఃపుర స్త్రీమూర్తి తన సోదరుడిని చాలాకాలం పాటు ఈ మందిరంలోనే దాచి ఉంచిందని చరిత్రకారుల భావన.

*8. ఇండియన్‌ నేషనల్‌ లైబ్రరీ*

కోల్‌కతాలోని 250 ఏళ్ల నాటి ఈ నేషనల్‌ లైబ్రరీ భవంతిలో 120 చ.అడుగుల విస్తీర్ణంలో ఒక గది ఉంది. అందులోకి ఎవరూ వెళ్లేవారు కాదు. అక్కడ దెయ్యం తిరుగుతోందన్న ఒక వదంతి చాలా ఏళ్లుగా దెయ్యంలా తిరిగింది. అందులోకి ప్రవేశించడానికి ఎలాంటి ద్వారాలూ లేవు! చివరికి పురావస్తు శాస్త్రవేత్తలు గోడలు బద్దలు కొట్టి లోనికి వెళ్లారు. వెళ్లేటప్పుడు వాళ్లు అనుకున్నది ఏమిటంటే... అది ఎవరిదైనా సమాధిగానీ, నిధులు నిక్షేపాలున్న మందిరంగానీ అయి ఉండొచ్చని! తవ్వి చూస్తే మట్టి తప్ప ఏమీ కనిపించలేదు. బహుశా అది ఆ గ్రంధాలయ భవంతికి పునాదిగా వేసిన ‘గట్టి పట్టు’ అయి ఉంటుందని çసరిపెట్టుకున్నారు.

*9. గ్రాండ్‌ సెంట్రల్‌*

న్యూయార్క్‌లోని గ్రాండ్‌ సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌ ప్రపంచంలోని ఏ స్టేషన్‌లోనూ లేనంతగా రణగొణ ధ్వనులతో ఉంటుంది. స్టేషన్‌లోని నాలుగో అంతస్తులో ఓ టెన్నిస్‌ క్లబ్‌ కూడా ఉందన్న సంగతి చాలామందికి తెలియదు. అప్పుడప్పుడు ఆ టెన్నిస్‌ బంతులు వచ్చి కింద ఉన్న ప్రయాణికులకు తగులుతుంటాయి కూడా!  ట్రైన్‌కి ఇంకా టైమ్‌ ఉంటే అందులోకి వెళ్లి ఆడుకోవచ్చు. అయితే ఉచితంగా కాదు. గంటకు 200 నుంచి 280 డాలర్ల రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అంటే సుమారు14 నుంచి 19 వేల రూపాయల వరకు.

*10. ఐఫిల్‌ టవర్‌*

ఐఫిల్‌ టవర్‌ లో ‘ఐఫిల్‌’ అనే పేరు గుశ్చేవ్‌ ఐఫిల్‌ అనే ఫ్రెంచి ఇంజినీరుది. ఈ డిజైనర్‌ చేసిన టవర్‌ కనుకే దానికి ఐఫిల్‌ టవర్‌ అనే పేరు వచ్చింది. ఐఫిల్‌ టవర్‌ శిఖరం పైన ఈయన తన కోసం ఒక అపార్ట్‌మెంట్‌ను కూడా కట్టించుకున్నాడు. పెంట్‌ హౌస్‌లా! ఆ సంగతి కొద్దిమందికి మాత్రమే తెలుసు.

No comments:

Post a Comment