భారత ఎన్నికల కమిషను
స్వతంత్ర భారత దేశంలో ఎన్నికలను సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు రాజ్యాంగం ఏర్పాటు చేసిన సంస్థ, భారత ఎన్నికల కమిషను. 1950 జనవరి 25 న ఏర్పాటు చేయబడిన ఈ కమిషనుసుప్రీం కోర్టు వలెనే, రాజ్యాంగం ఏర్పరచిన స్వతంత్ర వ్యవస్థ, ప్రభుత్వ నియంత్రణకు లోబడి ఉండదు.కమిషను వ్యవస్థ
దేశంలో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, లోక్‌సభ, రాజ్యసభ, రాష్ట్ర శాసన సభలు, శాసన మండళ్ళకు జరిగే ఎన్నికలను కమిషను నిర్వహిస్తుంది. ఈ ఎన్నికల నిర్వహణలో పర్యవేక్షణ, మార్గ నిర్దేశకత్వం, నియంత్రణ చేయవలసిన బాధ్యతను రాజ్యాంగం కమిషనుపై ఉంచింది.
ఎన్నికల కమిషను అధినేతను ప్రధాన ఎన్నికల కమిషనర్ అంటారు. మొదట్లో ఒక కమిషనరు ఉండేవారు. 1989 అక్టోబర్ 16 న మరో ఇద్దరు ఎన్నికల కమిషనర్లను నియమించారు. అయితే అది కేవలం 1990 జనవరి 1 వరకు మాత్రమే కొనసాగింది. మళ్ళీ 1993 అక్టోబర్ 1న ఈ నియామకాలు జరిగాయి. అప్పటి నుండి ముగ్గురు సభ్యుల కమిషను బాధ్యతలు నిర్వహిస్తూ వస్తూంది.
ముగ్గురు కమిషనర్లతో పాటు ఢిల్లీలో ఉన్న కమిషను కార్యాలయంలో కొంత మంది డిప్యూటీ కమిషనర్లు, 300 మంది ఇతర అధికారులు, సిబ్బంది ఉంటారు. రాష్ట్ర ఎన్నికల కమీషన్ రాష్ట్రాల్లో, ప్రధాన ఎన్నికల కమిషనరుచే నియమించబడే ముఖ్య ఎన్నికల అధికారి, కొందరు సహాయక సిబ్బంది ఉంటారు. అయితే ఎన్నికల సమయంలో మాత్రం, ఎన్నికల నిర్వహణలో పాల్గొనే 50 లక్షల పైచిలుకు సిబ్బంది యావత్తూ తాత్కాలికంగా ఎన్నికలు ముగిసేవరకు కమిషను అదుపాజ్ఞలలో పనిచేస్తారు.
ప్రధాన ఎన్నికల కమిషనరును, ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి నియమిస్తారు. పదవీకాలం ఐదేళ్ళు, లేదా ఆ వ్యక్తికి 65 ఏళ్ళ వయసు వచ్చే వరకు -ఏది ముందయితే అది.
ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులు నచ్చకపోతే తిరస్కరణ ఓటు వేసే అధికారాన్ని కల్పిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఓటర్లకు అవకాశం కల్పించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో అభ్యర్థుల గుర్తుతోపాటు నోటా (నన్ ఆఫ్ ది ఎబవ్) ను ఏర్పాటు చేశారు. ఎవరికైనా ఓటు వేయాలంటే సదరు అభ్యర్థికో, పార్టీకో ఓ గుర్తు వుంటుంది. ఆ గుర్తుకు ఓటర్లు ఓటు వేస్తూ ఉంటారు. అయితే, ఈ దఫా మాత్రం ఇప్పుడు పోటీలో వున్నవాళ్ళెవరికీ నేను ఓటు వేయడం లేదు అనే ఆప్షన్‌ను ఈవీఎంలలో పొందుపరిచారు. ఆ బటన్ నొక్కితే సదరు ఓటరు ఓటు ఎవరికీ పడదు. కానీ ఓటు హక్కును వినియోగించుకున్నట్టే.
ఇలాంటి అవకాశం ఇప్పటికే చాలా దేశాల్లో ఓటర్లకు అందుబాటులో ఉండగా, అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత్‌లో మాత్రం కాస్త ఆలస్యంగా ఇటీవలే అందుబాటులోకి వచ్చింది. ‘నోటా’ను అందుబాటులోకి తేవాలనుకుంటున్నట్లు ఎన్నికల కమిషన్ 2009లో తొలిసారిగా సుప్రీంకోర్టుకు చెప్పింది. ప్రభుత్వం దీనికి వ్యతిరేకించినా, పౌర హక్కుల సంస్థ పీయూసీఎల్ దీనికి మద్దతుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ఎట్టకేలకు ఎన్నికల్లో ‘నోటా’ను అమలులోకి తేవాలంటూ సుప్రీంకోర్టు 2013 సెప్టెంబర్ 27న రూలింగ్ ఇచ్చింది.
జాతీయ పార్టీలు-7
1)భారత జాతీయ కాంగ్రెస్(INC)
2) భారతీయ జనతా పార్టీ(BJP)
3)భారత కమ్యూనిస్టు పార్టీ(CPI)
4)బహుజన సమాజ్ పార్టీ(BSP)
5)నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)
6)కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్ట్ )-(CPM)
7)తృ ణమూల్ కాంగ్రెస్ (AITC)
No comments:
Post a Comment