Tuesday, February 7, 2017

current affairs



భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఫిబ్రవరి 6న చిన్నారుల కోసం ప్రత్యేక టెన్నిస్ అకాడమీని ప్రారంభించింది.ఫిల్మ్‌ నగర్‌లోని తన ఇంటికి సమీపంలో ఎస్ఎమ్ టీఏ గ్రాస్‌రూట్‌ లెవల్‌ పేరుతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో 3 నుంచి 8 ఏళ్ల చిన్నారులకు శిక్షణ ఇస్తారు. సానియా మీర్జా టెన్నిస్ అకాడమీ-SMTA 2013లో ఏర్పాటైంది.


టెస్టులు, వన్డేల్లో కొనసాగుతున్న అంపైర్ నిర్ణయ సమీక్షా పద్ధతి-DRS ని ఇకపై అన్ని ఫార్మాట్లలోఅమలు చేయాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి-ICC నిర్ణయించింది.దుబాయ్‌లో ఫిబ్రవరి 4 నుంచి 6 వరకూ రెండు రోజుల పాటు జరిగిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఈ ప్రతిపాదనను ఆమోదించారు. 2017 అక్టోబర్ నుంచి ఇది అమల్లోకి రానుంది.

ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే నాన్‌స్టాప్ విమాన సర్వీసును ఖతార్ ఎయిర్‌వేస్ ప్రారంభించింది.దోహా విమానాశ్రయం నుంచి ఫిబ్రవరి 5న బయలుదేరిన క్యూఆర్ 920 విమానం ఫిబ్రవరి 6 ఉదయానికి న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌కు చేరుకుంది. ఏకధాటిగా 16 గంటల 23 నిమిషాల్లో 14,535 కి.మీ. పయనించి ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే విమానంగా రికార్డు నెలకొల్పింది. భూ ఉపరితలంపై ఉన్న దూరానికి అనుగుణంగా ప్రయాణించిన కిలోమీటర్లను లెక్కించారు. కాగా దూరాన్ని ఆకాశమార్గంలో కొలిచినపుడు ఎయిరిండియాకు చెందిన ఢిల్లీ-శాన్‌ఫ్రాన్సిస్కో విమానం అత్యంత ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది.

14వ బయో ఏసియా సదస్సు ఫిబ్రవరి 6న హైదరాబాద్‌లో ప్రారంభమైంది.HICC వేదికగా మూడు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సుని గవర్నర్ నరసింహన్, తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా శామీర్‌పేట మండలం తుర్కపల్లి పారిశ్రామిక వాడ జీనోమ్ వ్యాలీకి మరో రూ. 3 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. కార్యక్రమంలో పాల్గొన్న నోబెల్ అవార్డు గ్రహీత, స్క్రిప్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్త కర్ట్ వుట్రిచ్ (2002, రసాయన శాస్త్రం), జాన్సన్ అండ్ జాన్సన్ చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ పాల్ స్టౌఫెల్స్‌లను జినోమ్ వ్యాలీ ఎక్సలెన్సీ అవార్డులతో సత్కరించారు.


భారత సంతతికి చెందిన ప్రఖ్యాత బ్రిటిష్ శిల్పి, సిరియన్ శరణార్థుల హక్కుల కోసం పోరాడిన అనిష్ కపూర్‌కు ప్రతిష్టాత్మక జెనెసిస్ అవార్డు లభించింది.శరణార్థుల పట్ల ప్రభుత్వాల దుర్మార్గపు విధానాలపై పోరాడినందుకు గాను ఇజ్రాయెల్‌కు చెందిన జెనెసిస్ ప్రైజ్ ఫౌండేషన్ ఆయనకు ఈ అవార్డును ప్రకటించింది. అవార్డు కింద ఒక మిలియన్ డాలర్లు (రూ. 6.71 కోట్లు) నగదు బహుకరిస్తారు.


ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ సంస్కరణల్లో భాగంగా గుంటూరులో రూ.1.10 కోట్లతో నిర్మించిన మోడల్ పోలీస్ స్టేషన్‌ను ఫిబ్రవరి 6న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.ఇందులో పనిచేసే కానిస్టేబుల్ నుంచి ఎస్సై వరకు ఖాకీ డ్రెస్ కాకుండా ముదురు నీలిరంగు ప్యాంటు, లేత నీలిరంగు షర్టు డ్రెస్‌కోడ్‌ను పాటిస్తారు. వారి షర్టుపై ‘ఐయామ్ ఏ కాప్’ అనే రేడియం స్టిక్కర్ ఉంటుంది. మహిళా కానిస్టేబుల్ ఖాకీ చీరపై ముదురు నీలి రంగు కోటు ధరిస్తారు. సిబ్బందికి బాడీ వార్న్ కెమెరాలు అందించారు.

ఇటీవలే 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న బ్రిటన్ రాణి ఎలిజబెత్ ఫిబ్రవరి 6న రాణిగా 65 ఏళ్లు (sapphire jubilee) పూర్తి చేసుకున్నారు.దీంతో ఆమె ఎక్కువకాలం సింహాసనాన్ని అధిరోహించిన బ్రిటన్ రాజ వంశస్తురాలిగా నిలిచారు.

No comments:

Post a Comment